నిష్కళంక పజ్రా నాయకుడు వెలమల అభిమాన ఆత్మబంధువు శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు 4 సెప్టెంబర్ జన్మదిన సందర్భంగా ప్రత్యేక కథనం
ముక్కుసూటితత్వం ఈయన నైజం. ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలుకొట్టినట్టు బయటకు చెప్పడం ఈయన తత్వం. నిజాయితీతో, నీతితో కూడిన రాజకీయాలు చేయడం ఆయన విధానం... ఆయనే మన వెలమజాతి మణిరత్నం చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి వున్న సీనియర్ నాయకుల్లో (చంద్రబాబు కన్నా ముందు) వీరు ఒకరు. ఒకే పార్టీ...ఒకే సిద్ధాంతం అన్న నినాదంతో నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ వెంటే వుంటూ విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర, పాత్ర కలిగిన వ్యక్తి, శక్తి అయ్యన్నపాత్రుడు గారే అని చెప్పక తప్పదు. పెద్దా చిన్నా, ధనిక, బీద అనే తేడా లేకుండా అందరినీ పేరు పెట్టి ఆప్యాయంగా పలకరించడం వీరి నైజం. నిగర్వి, నిరాడంబరుడు నిశ్వార్ధ రాజకీయ నాయకుడు అయిన మన అయ్యన్నపాత్రుడు గారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రఖ్యాత రాజకీయ నాయకుడు. ఆయన కీ॥శే॥ చింతకాయల వరహాలదొర దంపతులకు 1957 సెప్టెంబర్ 4న ఉమ్మడి విశాఖ జిల్లాలోని నర్సీపట్నంలో జన్మించారు. నర్సీపట్నంలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి, కాకినాడ పి.ఆర్. గవర్నమెంట్ కళాశాలలో బిఎ పట్టా సాధించారు. అయ్యన్న పాత్రుడు గారు 1983 జూన్ 1న పద్మావతిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, వీరిలో పెద్ద కుమారుడు విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. రాజకీయ ప్రస్థానం చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు 1983లో తెలుగుదేశం పార్టీ తరఫున నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. 1996లో అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నుకోబడటం తప్ప మిగతా ఏడుసార్లు నర్సీపట్నం శాసనసభ్యునిగా విజయం సాధించి, టీడీపీ అధికారంలో ఉన్న సమయాలలో వివిధ ముఖ్యమైన మంత్రి పదవులు చేపట్టారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ 21వ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రస్తుతం కొనసాగుతున్నారు. తన రాజకీయ ప్రస్థానంల్లో ప్రతిష్టాత్మక పదవులను చేపట్టడమే కాకుండా వాటికి వన్నెతెచ్చారు. ఈయన విభిన్న మంత్రిత్వ శాఖలలో పనిచేసి, ముఖ్యంగా రోడ్లు, భవనాల శాఖను సమర్థవంతంగా నిర్వహించారు. అలాగే సాంకేతిక విద్యాశాఖా మంత్రిగా పాలిటెక్నిక్, సాంకేతిక శిక్షణ సంస్థల స్థాపనలో కీలక పాత్ర పోషించారు. 1994-96 మధ్య రహదారులు, భవనాల శాఖా మంత్రిగా పనిచేసినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. 2014-2019 మధ్య ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్‌లో రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి పదవిని చేపట్టి గ్రామీణ అభివృద్ధికి విశేష కృషిచేశారు. నీతి, నిజాయితీ, నిష్కళంక చరిత్ర గల ఇటువంటి ఉత్తమ నాయకుడు రాష్ట్ర అభివృద్ధికి కార్యదీక్షతో కదిలి రావడం వెలమసమాజం గర్వించదగ్గ విషయం. అయ్యన్న పాత్రుడు గారు అనేకమంది పేద వెలమ కులస్తులకు విద్య, వైద్య, ఉద్యోగ విషయాలలో తన సహాయ సహకారాలు అందించిన ఆదర్శ నాయకుడు. అలాగే నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల సమస్యల పరిష్కారానికి తనదైన ఒక వ్యవస్థని ఏర్పరచుకున్నారు. ఎన్నో మంత్రిత్వ శాఖలను, పదవులను అవలీలగా, సమర్ధవంతంగా నిర్వహించి అయ్యన్న అంటే ఓ బ్రాండ్ పొలిటీషియన్‌గా పేరు సంపాదించారు. వెలమ జాతిలో అరుదుగా వుండే కొద్దిమంది నాయకుల్లో ప్రముఖ నాయకుడైన శ్రీ అయ్యన్నపాత్రుడు గారు నేడు జన్మదినం జరుపుకుంటున్న శుభ సందర్భంగా వారు ఆయురారోగ్యాలతో చిరకాలం వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ వెలమ సమాచార్, వెలమ సమాజం తరపున వారికి ఇవియే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
|