News and Events
Sabbam Hari gari 68th Jayanti
Posted on Wednesday 1st June, 2022 | Views 1140
Sabbam Hari gari 68th Jayanti
Description

అది వెలమజాతి నిర్లిప్తంగా, నిరాశక్తంగా తమ ఉనికి ఏమిటో తమకు తెలియకుండా తమశక్తి ఎంతో కూడా తెలియకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో బ్రతికేస్తున్న రోజులు అవి. దానిని ఆసరాగా చేసుకుని అల్పసంఖ్యాక ఉన్నత వర్గాలు అత్యధిక జనాభా కలిగిన వెలమలపై పెత్తనం చెలాయించి శాసించేవి. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలించి వెలమల శక్తిఏంటో, సామర్ధ్యాలేంటో, సామాజిక బలం ఏంటో, వెలమల శక్తిని తక్కువగా అంచనా వేసి నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందో అని రాజకీయ పార్టీలకు, నాయకులకు ఇతర సామాజిక వర్షాలకు తెలియజేయాలన్న దృడసంకల్పంతో కదిలింది ఓ పరిపూర్ణ వెలమ చైతన్య కెరటం. అతడే విశాఖ మాజీ మేయర్‌, వెలమ టైగర్‌ శ్రీ సబ్బం హరి. అర్ధంకాని వాళ్లకు అహంబవిగా అర్ధమైన వాళ్లకి ఆత్మబంధువుగా, ఆపన్నులకు ఆర్తులకు ఆపదలో ఉన్నవారికి ఆపద్భాంధవుడుగా, కార్యకర్తలకు మార్గదర్శకుడిగా నాడు ఆపదలలో వున్న పార్టీకి ప్రతిష్టగా నిలిచిన వ్యక్తిగా శక్తిగా నిత్య నూతన సంస్కరణలతో కూడిన ఆలోచనలతో నిండిన చైతన్యమూర్తిగా ఏ నలుగురు కాంగ్రెస్‌ వాళ్లు కలుసుకున్నా, ఏ నలుగురు వెలమ వాళ్లు కలుసుకున్నా తప్పక చర్చించుకునే వ్యక్తిగా శ్రీ సబ్బం హరి గారికి విశిష్టమైన ప్రత్యేకత వుంది. విశాఖ బీచ్‌లో అందమైన విగ్రహం చూచినపుడు, కార్పొరేషన్‌ ఎదురుగా గాంధీ విగ్రహంచూచినపుడు, డంపింగ్‌ యార్డును ప్రదేశంలో శివాజీ పార్కులో చూచినపుడు నేషనల్‌ హైవే లైటింగ్స్‌ను చూచినపుడు అందులో ఆయన స్ఫూర్తి, నిజాయితీ, దూరదృష్టి స్పష్టంగా కనిపిస్తాయి. ఆపదలో నేన్నానంటూ సమస్యలను పరిష్కరిస్తూ సొంత మనిషి వలే నిస్వార్ధంగా ఆపద్భాంధవుని వలే ఆదుకొని ఎన్నో జీవితాలను నిలిపి ఎన్నో సమస్యలను అతి సులువుగా చాకచక్యంగా పరిష్కరించిన వ్యక్తిగా, శక్తిగా, వ్యవస్థగా, అత్యంత సమర్ధునిగా, నిర్మొహమాట యధార్ధవాదిగా ఉత్తరాంధ్ర ప్రజలకు సుపరిచితులు అయిన శ్రీ సబ్బం హరి గారి జీవిత విశేషాలను క్లుప్తంగా...
    శ్రీ సబ్బం హరిగారు విశాఖ జిల్లాకు చెందిన భీమిలి తాలూకాలోగల చిట్టివలసలో వ్యవసాయదారులైన స్వర్గీయ బంగారునాయుడు శ్రీమతి అచ్చియమ్మ దంపతుల ఆరుగురి సంతానంలో చివరివాడిగా 1`6`1954వ తేదీన చిట్టివలసలో జన్మించారు. డిగ్రీ విశాఖలోని ఏవీఎన్‌ కాలేజీలో పూర్తి చేశారు. కాలేజి స్థాయిలోనే విద్యార్థి సంఘానికి జాయింట్‌ సెక్రటరీగా ఉద్యమస్ఫూర్తిని, నాయకత్వ పఠిమను చూపారు విద్యాభ్యాసం తరువాత కొన్ని సం.లు వ్యాపార రంగంలో వున్నారు. ఆనాడు అత్యంత ఖరీదైన వ్యవహారంగా భావించబడే సిమెంట్‌ వ్యాపారంలోనూ మరియు బియ్యం హోల్‌సేల్‌ వ్యాపారం, ట్రాన్స్‌పోర్టు రంగాలలోను ప్రవేశించి తన వ్యాపార సామర్ధ్యాన్ని నిరూపించుకున్నారు. 1986వ సం.లో ఆపద్కాలములో వున్న తనకిష్టమైన కాంగ్రెస్‌ పార్టీలో చేరి అటు పార్టీకి, ఇటు ప్రజలకి సేవ చేయాలనే ఆశయంతో తన రాజకీయ జీవితం ఆరంభించారు. ఆయన ప్రవేశమే సిటీ కాంగ్రెస్‌కి జాయింట్‌ సెక్రటరీ హోదాతో మొదలైంది. కాంగ్రెస్‌ పార్టీలో అతిరధ మహారధులని పేరుపడ్డ సీనియర్‌నేతలు శ్రీ రోశయ్యగారు, స్వర్గీయ శ్రీ జలగం వెంగళరావు గారు, శ్రీ వి.హనుమంతరావు మొదలైన 16 మంది పీసీసీ అధ్యక్షులతో కలిసి పని చేసి విశాఖపట్నం రాజకీయాలలో తనదైన ప్రత్యేక గుర్తింపుని పొందారు. నాటి కేంద్రమంత్రి శ్రీ సుబ్బరామిరెడ్డిగారు పార్లమెంట్‌కు పోటీపడినపుడు శ్రీ సబ్బం హరిగారు ఆయన విజయానికై చేసిన కృషి మరువలేనిది.
    శ్రీ సబ్బం హరిగారు వ్యాపారాలు చేసుకుంటున్నా, రాజకీయాలలో మునిగి తేలుతున్నా సేవా కార్యక్రమాలకు ఎప్పుడు సమయం మిగుల్చుకుంటూనే వుండేవారు. ప్రజల సమస్యలను విని వారికి చేతనైన సహాయం చేసేందుకు ఆయన స్థానికంగా ఒక కార్యాలయాన్ని అనేక సం.లుగా నిర్వహిస్తున్న సంగతి పరిసర ప్రాంతాల వారికి బాగా తెలుసు. ఆ విధంగా ఆయన సాయం పొందిన వారు అనేక వేల మంది వున్నారు. కులమతాలకు అతీతంగా సాగుతున్న ఈ సేవా కార్యక్రమాన్ని గురించి తెలుసుకున్న కొందరు వెలమపెద్దలు వెలమజాతికోసమూ ఏదైనా చేయమని ఆయనను కోరడం జరిగింది. ఆ విధంగా ఆనాడు వెలమ మహాసభ ఆలోచనకి శ్రీకారం చుట్టబడింది.
    సుమారు మూడు సంవత్సరాలు ఉత్తరాంధ్రలో ప్రతీ మండలానికి, వెలమజాతిని సంఘటితంగా ఒకచోట చూపాలన్న ఆశయంతో శ్రీ సబ్బం హరి గారు కన్వీనర్‌గా శ్రీ పైల సత్యనారాయణ, పైల మరిడయ్య, పైల సన్నిబాబు మొదలగు వారి సహాయంతో లక్షలాది మందితో ఉత్తరాంధ్ర వెలమమహాసభను 1993 మే 23 తేదీన నభూతో న భవిష్యతి అన్న రీతిలో విశాఖపట్నం డా. లంకపల్లి బుల్లయ్య కాలేజీ మైదానంలో నిర్వహించారు. ఈ సభ ద్వారా వెలమలకు తమలోని దాగి వున్న నేతలను పేరుపేరునా పరిచయం చేస్తుంటే ఆశ్చర్యపోవటం జనంవంతు అయింది. ఇంతమంది మహానేతలున్న మన వెలమ జాతా, ఇంత వెనకబడింది అని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు జనం. అదేరీతిన కులసభలంటే ఎవరొస్తారులే అని ఓ రకమైన నిర్లిప్తధోరణిలో వున్న నేతలకు ఆ సభలకు హాజరైన జనసంద్రాన్ని చూసి అబ్బుర పడిపోయారు. నడిపించే నాధుడు లేకనే జనం కూడా తమ చైతన్యాన్ని అణచివేసుకుంటున్నారని గ్రహించగలిగారు నేతలు. పంతాలకు, పట్టింపులకు, పార్టీలకు అతీతంగా జనసంద్రమైన ఆ మహాసభకి రాని నాయకుడు లేడు. రాని వెలమ ప్రజ లేదు. వెలమల సంఘటిత శక్తి ఆనాటి నుండే ఒక్కసారిగా బహిర్గతమైంది. లోకానికి తమ శక్తిని తెలియజేసిన వెలమలు ఆనాటి నుండి అంచెలంచెలుగా ఎదిగి అన్ని రంగాలలో ఉన్నత శిఖరాలధిరోహించి చూపించారు. మహాత్తరమైన ఈ పరిణామానికి మూలకారకుల్లో ముఖ్యులు శ్రీ సబ్బం హరిగారు. మహాసభల నిర్వహణ వరకే తన బాధ్యత అని సభాముఖంగానే చెప్పి ఆ తరువాత ఆ సారధ్య బాధ్యతలను విజయ ఫలాలను తరువాత తరంవారికి అప్పగించి నిశ్శబ్దంగా తప్పుకున్నారు సబ్బంహరిగారు.
    కష్టే ఫలే అన్నారు పెద్దలు. ప్రతీ కర్మకు ఫలితాలు వుంటాయి. కాకపోతే అవి ఏ విధంగా వస్తాయో ఎవరూ ఊహించలేరు. అదే జరిగింది శ్రీ సబ్బం హరిగారి విషయంలో అది 1995వ సం. కాంగ్రెస్‌ కష్టకాలంలో వున్న రోజులవి. కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసినా విజయ అవకాశాలు లేని రోజులవి అలాంటి సమయంలో విశాఖ నగర మేయర్‌ ఎలక్షన్స్‌ రావటం అది బీసీ అభ్యర్ధికి రావటం పార్టీ పరిశీలకులు విశాఖ నగరంలో వున్న నాయకులందరినీ పరిశీలించి సమర్ధుడైన శ్రీ సబ్బం హరి మేయర్‌ అభ్యర్థిగా నిలపడం జరిగింది. రాజకీయ పార్టీల అంచనాలను తలదన్ని ఊహాతీతంగా శ్రీ సబ్బం హరిగారు నగర మేయర్‌గా విజయం సాధించారు. ఈ అనూహ్య పరిణామం నాడు రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా నిలిచింది. విశాఖ నగరంలో నిస్సహాయ స్థితిలో వున్న కాంగ్రెస్‌ పార్టీకి సబ్బం హరిగారు కొత్త ఊపిరి పోసారు. వీరు మేయర్‌గా వున్న ఐదేళ్లు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని మారుమూల ప్రాంతాలకు కొండ ప్రాంతాలకు విద్యుత్‌, మంచినీరు సదుపాయాలే కాక అత్యంత ప్రతిష్టాత్మకమైన బీచ్‌రోడ్డులో మహనీయుల విగ్రహాలు, డంపింగ్‌ యార్డుగావున్న ప్రాంతాన్ని శివాజీ పార్కుగా మార్చిన తీరు అత్యత్భుతం. కాపులుప్పాడ లో డంపింగ్‌ యార్డు ఏర్పాటు, ఇండోర్‌ స్టేడియం ఏర్పాటు, బివికె కాలేజీ ఎదురుగా సెంట్రల్‌ లైబ్రరీ ఏర్పాటు, నగరంలోని నేషన్‌ హైవేలైటింగ్స్‌ మరియు ఎన్నో ఇతర అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. కార్పొరేషన్‌లో వున్న 4వ తరగతి                     ఉద్యోగుల నుండి ఐఏఎస్‌ ఆఫీసర్ల వరకు స్ఫూర్తిగా నిలిచారు. నిజాయితీకి మారుపేరుగా, అక్రమార్కుల పాలిట సింహ స్వప్నంగా వుంటూ విశాఖ కార్పొరేషన్‌ చరిత్రలో హరిగారు వారి పేరును చిరస్థాయిలో నిలబడేటట్లు చేసుకున్నారు. 

అలాగే 2009వ సంవత్సరం ఎన్నికలలో నాటి ముఖ్యమంత్రి డా॥ వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డిగారు సబ్బం హరిగారి సమర్ధతను గుర్తించి, ఆర్ధికంగా భలమైన సూర్య పత్రిక అధినేత నూకారపు సూర్యప్రకాశరావు, అల్లు అరవింద్‌లపై పోటీగా సబ్బం హరిగారిని నిలబెట్టడం ఆనాడు సంచలనం గా మారింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ లక్ష పైచిలుగు ఓట్ల మెజారిటీతో విజయం సాధించి మరో సంచలనానికి కేంద్రబిందు వయ్యారు. తదనంతర పరిణామాలతో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై. ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డిని సమర్ధిస్తూ, వ్యతిరేకిస్తూ తనదైన ప్రత్యేక శైలిని చాటుకున్నారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఆజన్మాంతం జీవించిన వీరు 2021 సంవత్సరం మే 3వ తేదీన మనందరినీ విడిచి ఉన్నత లోకాలకు చేరుకున్నారు. ఎక్కడ ఉన్నా వీరి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూఉందాం.

BG Naidu Editor:

velamasamachar/velama vijayam

9246670571

Director:

వెలమ వివాహ వేదిక &విశాఖ మ్యారేజ్ లైన్స్


QUICK MENU
Velama Vijayam Magazine
Community Information
Send Community Information
Velama Matrimony
Services
Register Your Information
Picture Gallery
Video Gallery
Contact us
 
ADVERTISEMENTS
Velama Samachar
Sabbam Hari 68th Jayanthi
VELAMA SAMACHAR
VISAKHA MARRIAGE LINES
Dharmana Prasada Rao Birthday
Velama Vivaha Vedika
B.G. Naidu Gari Birthday
T Harish Rao Birthday
 
Powered by Kalyan Infotech
Copyrights © Velama Samachar, All Rights Reserved